Saturday, December 19, 2009

తెలంగాణ గురించి




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు విభాగాలనూ కోస్తా ఆంధ్ర (లేదా ఆంధ్ర లేదా సర్కారు) మరియు రాయలసీమ అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతము నిజాం తన రాజ్యంలోని ప్రాంతములను రక రకాల కారణములతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము.


భౌగోళిక స్వరూపం

ఈ ప్రాంతము దక్కను పీఠభూమిపై, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది.

జిల్లాలు

ప్రస్తుత తెలంగాణా ప్రాంతమునందు, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అను జిల్లాలు కలవు.

భౌగోళిక మార్పులు

స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే చూపించబడుతున్నది.

చరిత్ర

తెలంగాణా చరిత్ర

ఈ ప్రాంతము మూడవ శతాబ్దంలో శాతవాహనులు, తరువాత కాకతీయులు, తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు పరిపాలించినారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చు నాటికి ఈ ప్రాంతము నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత తెలంగాణా పోలీసు చర్య ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలపబడినది, ఈ పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. తరువాత 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడు వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించినది.


ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు

హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.


తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వచ్చింది.



మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

ప్రధాన వ్యాసము: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండవ అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి రెండవ అనే పదం వాడవచ్చు.


ఈ ఉద్యమానికి సారథి కె.చంద్రశేఖరరావు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు. 2001 లో ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరిట ఒక రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసాడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. చక్కటి కార్యక్రమాలతో సమర్ధవంతమైన నాయకత్వంతో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించుకు వచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆసక్తి, ఈ అంశం యొక్క ఉద్వేగ భరిత చరిత్ర కూడా దీనికి దోహదపడ్డాయి.


ఈ లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లోని ప్రముఖ నేత ఆలె నరేంద్ర ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణ సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉద్యమం ప్రారంభించాడు. కొద్ది కాలానికే - ఆగష్టు 2002 లో - తన సంస్థను తెరాస లో విలీనం చేసి, తెరాసలో తాను రెండో ప్రముఖ నాయకుడయ్యాడు.


2004 లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని, తెరాస మంచి విజయాలు సాధించింది . ఆ ఎన్నికలలో తెలుగుదేశం, భాజపా లను ఓడించి, కాంగ్రెసు (మరియు దాని నాయకత్వంలోని కూటమి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ చేజిక్కించుకుంది. కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రభుత్వంలో చేరింది.


ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది.

కోస్తా ఆంధ్రుల భయాలు

* పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.

తెలంగాణా వాదుల వాదనలు

* ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.


ఐఏఎస్‌ ఐపిఎస్‌ల భయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్‌ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.

తెలుగు సినీ పరిశ్రమ భయం

మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్‌ కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.


తెలంగాణా తల్లి

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||

తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||

పోతన దీ పురిటిగడ్డ రుద్రమ దీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీము డేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||

జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరా లు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
సురాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

‘పంపన’కు జన్మనిచ్చి ‘బద్దెన’కు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
‘హాలుని’ గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన || జై…||

ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కి సోమన్న’
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’ || జై…||

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధు వతడు
‘దిగ్నాగుని’ కన్న నేల ధిక్కారమే జన్మహక్కు || జై…||

రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచెర్ల
‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
‘పిలలమఱ్ఱి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు || జై…||

సమ్మక్క’లు ‘సారక్క’లు ‘సర్వాయిపాపన్న’లు
సబ్బండావర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ
దండునడిపే పాలమూరు ‘పండుగోల్ల సాయన్న’ || జై…||

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పు డమరుకము డక్కి శారదస్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగా
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం || జై…||

బడులగుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక
ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి || జై…||

గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥ -- అందెశ్రీ -- Discover Telangana

No comments:

Post a Comment